తమిళనాడులో నకిలీ ఎస్‌బిఐ బ్రాంచ్

తమిళనాడులో నకిలీ ఎస్‌బిఐ బ్రాంచ్
మనం నకిలీ నోట్లు, నకిలీ సర్టిఫికెట్లు చూసాము. కానీ ఏకంగా ఒక నకిలీ బ్యాంకు బ్రాంచ్ నెలకొనడం తమిళనాడులో జరిగింది. బ్యాంకులకు బురిడీ కొట్టి రుణాలు పొంది ఎగగొట్టడం చూస్తున్నాము. ముగ్గురు వ్యక్తులు ఏకంగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్‌రూటి తాలుకాలో చోటు చేసుకుంది. 3 నెలల పాటు సాఫీగా సాగిన ఈ నకిలీ బ్రాంచ్‌ వ్యవహారం చివరికి  ఓ ఎస్‌బీఐ కస్టమర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురిలో ప్రధాన సూత్రధారి కమల్‌బాబు తల్లి బ్యాంకు మాజీ ఉద్యోగి. 
 
ఓ పేరుమోసిన బ్యాంకులో పనిచేసి ఆమె రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. మరో వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి రబ్బర్‌ స్టాంప్‌లను తయారీ చేస్తున్నారు. 
 

ఎస్‌బీఐ కస్టమర్‌ ఒకరికి ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చి స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. సదరు మేనేజర్‌ ఈ సమాచారాన్ని జోనల్‌ ఆఫీసుకు తెలియజేశారు. ఎస్‌బీఐకు సంబంధించి పన్‌రూటీలో కేవలం 2 బ్రాంచులకు మాత్రమే అనుమతులున్నాయని మూడోది బ్రాంచ్‌ నకిలీదని జోనల్‌ అధికారులు నిర్ధారించారు. 

నకిలీ బ్రాంచ్‌ను సందర్శంచి అందులో సోదాలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఈ బ్రాంచ్‌ నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రూపకల్పన చూసి అధికారులు విస్తుపోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పన్‌రూటీ పోలీసులు ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అంబేద్కర్‌ తెలిపారు.