ఉగ్రవాద సూత్రధారులు, పాత్రధారులకు పాక్ రాజమర్యాదలు 

ముంబై తదితర ప్రాంతాలలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధిచిన వ్యూ హకర్తలు, సూత్రధారులు, పాత్రధారులు అంతా పాకిస్థాన్‌లో రాజమర్యాదలు పొందుతున్నారని భారత్ విమర్శించింది. 
 
ఉగ్రవాద నిరోధక చర్చల వారం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటు అయిన ఆన్‌లైన్ సదస్సులో భారతీయ ప్రతినిధి బృందం సారథి మహావీర్ సింఘ్వి పాకిస్థాన్ వైఖరిని దుయ్యబట్టారు. 
 
పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. ముంబైలో వరస బాంబు పేలుళ్లు ఇతర ఘటనలపై తమ దేశం నిర్థిష్ట సాక్షాధారాలను పాకిస్థాన్‌కు పంపించిందని అంతర్జాతీయ సమాజానికి సింఘ్వీ తెలిపారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదని తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదులు ప్రధాన పాత్రధారులు ఇప్పటికీ ఆ దేశంలోనే తిష్టవేసుకుని ప్రభుత్వ గౌరవాలను పొందుతున్నారని ధ్వజమెత్తారు.

ఉగ్రవాదానికి ఏ విధంగా సహకరించినా అది అన్యాయమే అవుతుందని చెబుతూ పాకిస్థాన్ కనీస పద్థతిని కూడా పాటించకుండా ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడంలో అసలు ఔచిత్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇటువంటి పరిణామాలతోనే ఆ దేశం నుంచి ఇప్పటికీ సీమాంతర ఉగ్రవాదం నిక్షేపంగా సాగుతోందని మండిపడ్డారు.

పాకిస్థాన్ ఉగ్రవాద ఉత్పత్తి దేశంగా మారిందని వెల్లడించాయిరు. ఉగ్రవాద నిరోధక చర్యల ద్వారా మానవ హక్కుల పరిరక్షణ దిశలో ప్రపంచదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని,అయితే దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని సింఘ్వీ విమర్శించారు.

సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను దాటించడం, వారికి వ్యూహాత్మక మద్దతును అందించడం వంటివి జుగుప్సాకరంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ఉగ్రవాదపు విషసర్పానికి ప్రధాన స్థావరంగా పాకిస్థాన్ మారిందని అంతర్జాతీయంగా పలుసార్లు రుజువు అయిందని గుర్తు చేశారు.  ప్రత్యేకించి భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్ ప్రేరేపిత శక్తులే కారణం అని ఆధారాలతో వెల్లడైందని తెలిపారు.

1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లు, తరువాత 2008లో జరిగిన దాడులకు సంబంధించి పాకిస్థాన్ అందించిన సైనిక ఆర్థిక ఇతరత్రా సాయం గురించి పలు సాక్షాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 

ఆ దేశంలో పద్ధతి ప్రకారం మైనార్టీల ఊచకోత జరుగుతోందని, వారిని అనేక విధాలుగా వేధిస్తున్నారని విమర్శించారు. క్రిస్టియన్లు, అహ్మదీయులు, సిక్కులు, హిందువులు, షియాలు, పస్తూన్లు, హజారాలు, సింంధీలు, బలూచీలపై హింసాత్మక చర్యలు సాగుతున్నాయని, నిరంకుశ విధానాలతో మతమార్పిడులకు పాల్పడుతోందని మండిపడ్డారు.

జమ్మూకశ్మీర్‌పై లేనిపోని వాదనలు సాగిస్తూ వచ్చిన పాకిస్థాన్ అక్కడ పరోక్ష యుద్ధానికి కుట్రలు పన్నుతూ వచ్చిందని ధ్వజమెత్తారు. కశ్మీర్ భారతదేశపు అంతర్భాగమనే విషయం అక్కడి ప్రజల సంఘీభావంతోనే మరోమారు స్పష్టం అయిందని స్పష్టం చేశారు.