ఎన్‌ఐఏ కు కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు 

తిరువనంతపురం బంగారం స్మగ్లింగ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో విచారణ జరిపేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. వ్యవస్థీకృత స్మగ్లింగ్ ఆపరేషన్‌తో దేశ భద్రతకు తీవ్రమైన విఘాతం ఏర్పడే సూచనలున్నాయి కాబట్టే ఎన్‌ఐఏ విచారణకు అనుమతినిచ్చినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 
 
ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ కేసును ఎన్‌ఐఏ తో దర్యాప్తు జరిపించాలని కేంద్రం నిర్ణయించడం పట్ల కేరళ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఏ ఏజెన్సీ దర్యాప్తు జరిపినా తమకు అభ్యంతరం లేదని చెబుతూ అయితే నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, వాస్తవాన్ని వెలుగులోకి తేవాలని కోరింది. 
 
కేరళ కాంగ్రెస్ అధ్యక్షడు ఎం రామచంద్రన్ ఈ దర్యాప్తును స్వాగతిస్తూ సిబిఐ, రా లను కూడా దర్యాఫ్తులోకి దింపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. బంగారం స్మగ్లింగ్ వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు, కొందరు కస్టమ్స్ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వాస్తు ఉండడంతో కట్టుదిట్టమైన దర్యాప్తు అవసరమని చెప్పారు. పైగా యుఎఇ తో మన సంబంధాలకు సంబంధించిన అంశం కూడా అని పేర్కొన్నారు. 
 
ఈ కేసు రాజకీయ దుమారం రేపడంతో దర్యాప్తులో భారత ప్రభుత్వనాయికి సహకారం అందిస్తామని ఢిల్లీ లోని  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రాయబారి హామీ ఇచ్చిన్నట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ తిరువనంతపురంలోని యుఎఇ అధిపతి రషీద్ ఖమీస్ ఆల్ షామిలి ఆదేశంపైననే తనకు తిరువనంతపురం విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారిని సంప్రదించినట్లు హైకోర్టు కు తెలపడం గమనార్హం.