డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా నిష్క్రమణ    

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు గత మే నెలలో ప్రకటించిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ప్ర‌క్రియ‌కు సంబంధించి క‌ద‌లిక‌లు ప్రారంభించారు. డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి త‌ప్పుకునే అంశంపై ఐక్య‌రాజ్య‌స‌మితితో పాటు అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్ తెలియ‌జేశారు. అయితే ఈ కానీ ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ‌కు ఏడాది కాలం ప‌ట్ట‌నున్న‌ది.

డబ్ల్యూహెచ్‌వో నుంచి త‌ప్పుకునేందుకు అమెరికా త‌మ‌కు నోటిఫై చేసిన‌ట్లు యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌తినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ 2021 జూలై 6 వ‌ర‌కు పూర్తికానున్నట్లు తెలుస్తున్న‌‌ది.  డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా త‌ప్పుకుంటున్న‌ట్లు త‌మ‌కు కూడా లేఖ అందిన‌ట్లు ఫారిన్ రిలేష‌న్స్ క‌మిటీ  డెమోక్రాట్ సేనేట‌ర్ రాబ‌ర్ట్ మెనెన్‌డేజ్ తెలిపారు.

క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు ట్రంప్ ఆరోపించారు. అందుకే డ‌బ్ల్యూహెచ్‌వోకు నిధుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఆయ‌న గ‌తంలోనే ప్రకటించారు.  ట్రంప్ చేసిన సూచ‌న‌ల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో ప‌ట్టించుకోలేదు.

ట్రంప్ నిర్ణ‌యంపై అధ్య‌క్ష రేసులో ఉన్న‌ జోసెఫ్ బైడెన్ తీవ్రంగా విభేదించారు.  తాను అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి రోజే డ‌బ్ల్యూహెచ్‌వోతో మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసే ప‌త్రంపై సంత‌కం చేయ‌నున్న‌ట్లు స్పష్టం చేశారు.