ఎస్ బ్యాంకు కేసులో రూ 2,203 కోట్ల ఆస్తుల జప్తు 

ఎస్ బ్యాంకు కుంభకోణంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్‌  బ్యాంకు  వ్యవస్థాపకుడు రానా కపూర్, డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్ , ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
వీటి విలువ 2,203 కోట్ల రూపాయలని  అధికారులు ప్రకటించారు. ఇందులో రాణా కపూర్‌ విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక (పీఎంఎల్‌ఏ)చట్టం ప్రకారం ముంబైలోని పెద్దార్ రోడ్‌లో ఉన్న ఒక బంగ్లా, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, ఢిల్లీలోని అమృత షెర్గిల్ మార్గ్ వద్ద  ఉన్న 48 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
వీటితోపాటు న్యూయార్క్‌లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, లండన్‌లో రెండు కమర్షియల్‌ ప్రాపర్టీస్‌తోపాటు ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. కాగా యస్‌ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి రాణా కపూర్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటికే క్రిమినల్ కేసులను నమోదు చేశాయి.
కపూర్, అతని కుటుంబ సభ్యులు, ఇతరులు రూ 4,300 కోట్ల  మేర అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది.  రాణా కపూర్‌ క్విడ్‌ప్రోకో కింద డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా పలు సంస్ధలకు భారీగా రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ చార్జిషీట్‌లో  పేర్కొంది. మార్చిలో అరెస్టు  అయిన కపూర్, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.