చౌక అద్దె గృహాల కాంప్లెక్స్ ల అభివృద్ధి

చౌక అద్దె గృహాల కాంప్లెక్స్ ల అభివృద్ధి
వ‌ల‌స‌కార్మికులు, ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం చౌక అద్దె గృహాల కాంప్లెక్స్ ల ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సర్కారు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ సబ్ స్కీమ్ కింద   అందుబాటు ధరకే అద్దె హౌసింగ్ కాంప్లెక్స్‌లను అందించనుంది. 
 
వీటి  అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.  రూ 600 కోట్ల వ్యయాన్ని “టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్” రూపంలో అంచనా వేసినట్లు  మంత్రివర్గ సమావేశం తరువాత అధికార ప్రతినిధి  ట్విట్టర్‌లో తెలిపారు. ఈ పథకంలో భాగంగా, ఖాళీగా ఉన్న సర్కారు స్థలం లో ప్రభుత్వ నిధులతో అద్దె హౌసింగ్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. 
 
మొదటి దశలో మూడు లక్షల మందికి  లబ్ధిచేకూరనున్నది. వలస కార్మికులు , పట్టణ పేదలకు తక్కువ అద్దె కు ఇండ్లను అందించడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.   
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)పై  జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 72లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది.
ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన, భారత్‌ ఆత్మనిర్భర్‌ కింద ఈ జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు ఈపీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ 24శాతం (12 శాతం ఉద్యోగుల వాటా, 12 శాతం యజమానుల వాటా) పొడిగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదు నెలల పాటు పొడిగించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీంట్లో 81 కోట్ల మందికి 203 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నవంబర్‌ వరకు కేటాయించనున్నారు. గత మూడు నెలల్లో 120 లక్షల టన్నులు పంపిణీ చేశారు.