‌ దూబే  సన్నిహితుడు అమర్‌ దూబే  ఎన్ కౌంటర్

 
 కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్  వికాస్‌దూబే అత్యంత సన్నిహితుడు అమర్‌ దూబేను బుధవారం ఉత్తర ప్రదేశ్  స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కాల్చి చంపారు. వికాస్ దూబే పర్సనల్ బాడీ గార్డు కూడా అయిన అమర్‌ దూబేను హామీర్ పూర్‌లో ఎన్ కౌంటర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
గతవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో అమర్‌ దూబే హస్తం కూడా ఉంది. ఇతనిపై రూ 25,000 యల రివార్డు ఉంది. మరోవైపు చౌబేపూర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌ప్టర్‌కు చెందిన మరో సహచరుడైన శ్యామ్‌ బాజ్‌పాయ్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
 
 ఇక యూపీ, హర్యానా పోలీసులు సంయుక్తంగా వికాస్ దూబే కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు.
 
వికాస్‌దూబేను పట్టిస్తే అందించే నగదు బహుమతిని ఉత్తర ప్రదేశ్  పోలీసులు మరోసారి పెంచారు. ఇటీవల ఈ నగదు బహుమతిని రూ 2.5 లక్షలుగా ప్రకటించిన పోలీసులు దీన్ని రూ 5 లక్షలకు పెంచారు. 
 
హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల ఓ హోటల్‌లో వికాస్‌ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం అందగా, అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే విషయం తెలుసుకున్న వికాస్‌ దూబే సదరు హోటల్‌ నుంచి పరారయ్యాడు. 
 
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే వికాస్‌ దూబేను పట్టిస్తే రూ 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. ఇదిలావుండగా కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబేను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడి గ్యాంగ్‌ కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే