మ‌ర‌ణం లేని మ‌హానేత వైఎస్సార్‌

“నాన్న‌గారి 71వ జ‌యంతి నేడు. ఆయ‌న మ‌ర‌ణం లేని మ‌హానేత‌. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవ‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, జ‌ల‌య‌జ్ఞం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది” అంటూ  తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.  
ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌కు నివాళి అనంతరం “నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం “నాలో.. నాతో వైఎస్సార్‌”. వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం.
వీటితోపాటు ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.  రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్‌జీయుకేటీ, ఆర్‌కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.