నిమ్మగడ్డ కేసులో జగన్ కు మరోసారి చుక్కెదురు 

నిమ్మగడ్డ కేసులో జగన్ కు మరోసారి చుక్కెదురు 

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో మరోసారి ఏపీ సర్కార్‌కు చుక్కెదురైంది. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. గతంలోనే ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఎస్‌ఈసీ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఉద్దేశం సరిగ్గా లేదని ధర్మాసనం తప్పుపట్టింది.

ఇంతకముందే స్టేకు నిరాకరించిన విషయాన్ని న్యాయస్థానం గుర్తుచేసింది. తుది విచారణ మూడు వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. కోవిడ్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌ తెచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. 

అక్కడ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా ఈ కేసు విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.