భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతుందని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ మాజీ అధిపతి కేవీ కామత్ విశ్వాసం వ్యక్తం చేశా రు. వివిధ ఆర్థికవేత్తలు, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు చెప్తున్నట్లుగా దేశ జీడీపీ దారుణంగా మైనస్‌లోకి వెళ్లే అవకాశాల్లేవని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఎస్‌అండ్‌పీ వంటి సంస్థల గణాంకాలు అతిగా ఉన్నాయని కొట్టిపారవేసారు.
నిజానికి మున్ముందు ఏం జరుగబోతున్నదో అంచనా వేయడం చాలా కష్టమని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) భారత వృద్ధిరేటు మైనస్ 4.5 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్, మైనస్ 5 శాతానికి దిగజారవచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే భారత ఎకానమీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వేగంగా పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. నామమాత్రపు పరిశీలనలతో దేశ జీడీపీని తక్కువ చేస్తూ ఉత్తుత్తి అంచనాలు వేస్తున్నారని విమర్శించారు.
నిజానికి పారిశ్రామిక కార్యకలాపాలు తిరిగి మునుపటి స్థితికి చేరుకుంటున్నాయని, 80-90 శాతం సామర్థ్యానికి ఉత్పత్తి చేరుకుంటున్నదన్న ఆనందం పరిశ్రమలోనూ కనిపిస్తున్నదని చెప్పారు. ఇక పెరుగుతున్న విద్యుత్ వినియోగం గతి తప్పిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతున్నదన్న సంకేతాలనిస్తున్నదని పేర్కొన్నా రు. అయితే నిర్మాణ, మౌలిక, ఆర్థిక సేవల రంగాలు కరోనా వైరస్ ధాటికి తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని, వీటికి ప్రభుత్వ చేయూత అవసరమని సూచించారు.
కాగా, వడ్డీరేట్లు తక్కువగా ఉంటే బ్యాంకుల మనుగడకే ముప్పు అని సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ హెచ్చరించారు. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మొండి బకాయిలు పెరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ‘బ్యాంకింగ్ రంగం సమస్యల్లో ఉన్నట్లు అనిపిస్తున్నది. అయితే ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమిస్తాయని భావిస్తున్నాను’ అని తెలిపారు.
వడ్డీరేట్లు తక్కువగా ఉండటం బ్యాంకులకు అంత మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు. దీనివల్ల బ్యాంకుల నిర్వహణే కష్టతరం కావచ్చని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఆగస్టుదాకా మారటోరియంను ఆర్బీఐ పొడిగించడాన్ని స్వాగతించారు.
మరోవంక, వృద్ధి ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఫిక్కి ఫ్రేమ్స్ 2020లో మాట్లాడుతూ ‘భారత ఆర్థిక వ్యవస్థలో మందగించిన వృద్ధిరేటు త్వరలోనే తిరిగి ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఆ నమ్మకం నాకున్నది’ పేర్కొన్నారు. ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలు తిరిగి వృద్ధిపథంలోకి వచ్చిన సంకేతాలున్నాయని చెప్పారు.
నిజానికి ఈ మహమ్మారి భారత్‌కు మాత్రమే సవాల్ విసరడం లేదని, యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిందని గుర్తు చేశారు. కాగా, భవిష్యత్తులో స్థిరమైన వృద్ధిరేటు కోసం 12-13 రంగాలను గుర్తించి, వాటి సమగ్రాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!