
నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా జోక్యం పెరిగిపోతున్నది. ఇటీవల అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (ఎన్ సి పి)లో రగులుతున్న వివాదానికి ఆ దేశంలో చైనా రాయబారి హౌ యాంకీ కేంద్ర బిందువుగా మారారు.
గత ఏప్రిల్ నుంచి ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వివాదాన్ని సద్దుమణచడం కోసం హౌ యాంకీ పలువురు నేపాలీ రాజకీయ నాయకులతో సమావేశమై చర్చలు జరిపారు.
నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి పరిపాలన సరిగా లేదని, ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఎన్ సి పి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండ నేతృత్వంలో అసమ్మతి వెల్లువెత్తుతున్నది. ఏప్రిల్ నెలాఖరు నుంచి అంతర్గతంగా కొనసాగుతున్న ఈ వివాదం గురించి హౌ యాంగ్‌కు అన్నీ తెలుసు.
ఎందుకంటే ఏప్రిల్ నెల చివరలో, మే నెల మొదట్లో పలువురు అధికార కమ్యూనిస్టు పార్టీ నేతలతో ఆమె చర్చించారు. అయినా ఆ వివాదం ఇప్పుడు బహిర్గతమైంది.
నేపాల్‌లోని కమ్యూనిస్టు నాయకులనంతా ఏకతాటిపైకి తేవడంలో చైనా కీలకపాత్ర పోషించి ఉంటుందని, అందుకే ఇప్పుడు అధికార పార్టీలో అసమ్మతిని తగ్గించేందకు ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత వారం రోజుల వ్యవధిలో కూడా చైనా రాయబారి హౌ యాంకీ పలువురు నేపాల్ నేతలతో చర్చలు జరిపారు. జూలై 3న నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిశారు. అయితే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఆమె చెప్పారు.
జూలై 5న సీనియర్ నాయకుడు మాధవ్‌కుమార్ నేపాల్‌తో హౌ సమావేశమయ్యారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రధాని కేపీ శర్మ ఓలి, ఎన్ సి పి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) లతో హౌ యాంకీ భేటీ అయ్యారు.
నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉండటం, పార్టీలో చీలిక రాకుండా చైనా జోక్యం చేసుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో నేపాల్ రాజకీయాలపై చైనా పైచేయి సాధిస్తుందేమోనన్న అనుమానం కలుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూస్క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్