తీవ్ర తప్పిదంకు పాల్పడిన ఎల్జీ పాలిమర్స్  

విశాఖలో గ్యాస్ లీక్ ద్వారా 13  మంది మరణానికి దారి తీసిన ప్రమాదంకు ఎల్జీ పాలిమర్స్ తీవ్ర తప్పిదమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదిక స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ 4,000 పేజీల నివేదికను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. 
 
విశాఖలో జరిగింది కేవలం గ్యాస్‌లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిక స్టైరిన్‌ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని తెలిపారు. ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలను కాపాడం చాలా కీలకమైన విషయామని, అయితే  ఎల్జీ పాలిమర్స్‌ విషయంలో తీవ్ర తప్పదం జరిగిందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేషన్‌ పైపులు మార్చారని, దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించామని చెప్పారు.
 
 ఎల్జీ పాలిమర్స్‌ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిదని స్పష్టం చేస్తూ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం సంభవించిందని వెల్లడించారు.  ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ ర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్‌లున్నప్పటికీ ప్రమాదం జరిగినా సైరన్‌ మోగించలేదని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్‌లో అల్లారం ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యమని నివేదిక వెల్లడించింది. 
 
స్టైరిన్‌ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలో లేవని పేర్కొంటూ ఒకవేళ ఇలాంటి రసాయనాలు అందుబాటులో ఉంటే స్టైరిన్‌ను త్వరగా న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండేదని తెలిపారు. ఈ రసాయనాలను గుజరాత్‌ నుంచి తెప్పించాల్సి వచ్చిందని,  అప్పటికే ట్యాంకుల్లో టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయిందని వివరించారు.