ఎల్జీ పాలిమ‌ర్స్ సీఈవో స‌హా 12 మంది అరెస్ట్  

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కంపెనీ ఎండీ-సీఈవో సుంకీ జియాంగ్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌ సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మే ఏడో తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా.. 500 మంది వరకూ తీవ్ర ప్రభావితులైన విషయం తెలిసిందే. 
 
ఈ ఘటనపై గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో 304-11, 278, 284, 285, 337, 338 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద (క్రైమ్‌ నంబర్‌ 213/2020) కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి.. మంగళవారం అరెస్టు చేసినట్టు విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా తెలిపారు. 
 
ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల ఉన్నత స్థాయి నిపుణులతో  నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించగా, మరుసటి రోజునే అరెస్టులు జరిపారు.
 
ఈ ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది. ఈ నివేదిక ఇచ్చిన 24 గంటల లోపే అరెస్ట్ లు జరిపారు.  
 
ఈ నివేదికలో గ్యాస్ లీక్ ప్ర‌మాదానికి కంపెనీ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించింది. స‌రైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటించ‌క‌పోవ‌డంతో పాటు క‌నీసం అనూహ్య‌మైన ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు మోగాల్సిన సైర‌న్లు కూడా ప‌ని చేయ‌క‌పోవ‌డంతో భారీగా ప్రాణ న‌ష్టం జ‌రిగింద‌ని క‌మిటీ వెల్ల‌డించింది.