2021 కన్నా ముందు కరోనా వ్యాక్సిన్‌ అసాధ్యం

కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ వ్యాప్తంగా తయారౌతున్న వ్యాక్సిన్లు 2021లోపు పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేయడం అసాధ్యమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
అగస్టు 15 నాటికల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటూ ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాసిన లేఖ వివాస్పదమై నేపథ్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ  ప్రకటన విడుదల చేసింది. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  
 
బీహార్‌ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ లేఖ రాసారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ స్పష్టత నిచ్చింది. 
 
క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న భారత్‌కు చెందిన కోవాక్సిన్‌, జైకో-డితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో 11 టీకాలు 2021లోపు అందుబాటులోకి వచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. 
 
 ”కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌పై ఆరు కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిల్లో భారత దేశం నుండి రెండు కంపెనీల వ్యాక్సిన్లు, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న 140 కంపెనీల్లో 11 కంపెనీల వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కటీ కూడా 2021 కన్నా ముందు పెద్ద ఎత్తున ప్రజలకు పంపిణీ చేయడం సాధ్యం కాదు” అని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
 
మరోవైపు, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.  కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని తెలిపింది.