వాట్సాప్ మాదిరిగా చాటింగ్, వీడియోలు, డాక్యుమెంట్లు పంపుకోవడం.. ఫేస్‌బుక్ మాదిరిగా ఫ్రెండ్ రిక్వెస్ట్, ఫాలో చేయగలగడం.. షాపింగ్, ఇష్టమైన ఆహారం ఆర్డర్ ఇవ్వడం.. డిజిటల్ పేమెంట్స్.. ఇలా పలు యాప్‌లలో ఉన్న ఫీచర్లతో కూడిన ‘ఎలిమెంట్స్’ అనే తొలి దేశీయ సోషల్‌మీడియా యాప్ అందుబాటులోకి వచ్చింది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన బెంగళూరులోని సుమేరు డెవలపర్స్ మేకిన్ ఇండియా నినాదంతో దీన్ని అభివృద్ధి చేసింది. దాదాపు వెయ్యిమంది ఐటీ నిపుణులు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వలంటీర్లు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు.
ఎలిమెంట్స్ సోషల్‌మీడియా యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ప్రయోగాలకు వెనుకాడని ఉత్సాహవంతులైన యువత నవభారతానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యాప్ తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేశారు.
సోషల్‌మీడియాను ఎక్కువగా వినియోగించేవారికి కావాల్సిన అన్ని ఫీచర్లను ఈ యాప్‌లో పొందుపరిచామని ఆవిష్కర్తలు తెలిపారు. తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు హామీ ఇస్తున్నామని, సమాచారం మొత్తం భారత్‌లోనే నిక్షిప్తం చేస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో ఆడియో కాల్స్, వీడియోకాల్స్, గేమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, పలువురు ఎంపీలు, వివిధ రాష్ర్టాల అధికారులు పాల్గొన్నారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం