కరోనా భయంతో హైదరాబాద్ నుండి పరుగో పరుగు!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా మహమ్మారి ఉధృతరూపం దాల్చడం, ప్రభుత్వం చేబడుతున్న కట్టింది చర్యలు పట్ల విశ్వాసం సన్నగిల్లడం, కనీసం టెస్ట్ లకు కూడా సరైన సదుపాయాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామాలకు, స్వస్థలకు పరిగెత్తుతున్నారు. 
 
మరో సారి పక్షం రోజులపాటు లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకేతం ఇవ్వడంతో గతం మూడు, నాలుగు రోజులుగా నగరం నుండి వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 
 
ఇటీవల హైదరాబాద్‌లో కేసులు పెరుగుతుండటం తో నగరంలో చాలా మంది గత మూడు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇరుకు ఇళ్లలో పిల్లలతో కలిసి ఉండటం ఇబ్బందిగా ఉండటం, నగరం కంటే పల్లెటూళ్లే సురక్షితం అనే భావనతో చాలా మంది తమ ఊళ్లకు వెళ్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. కొంత మందైతే.. కార్లు, బైక్‌లు, ఆటోల్లోనూ ప్రయాణం చేస్తున్నారు. 
 
నగరంలో స్వయం ఉపాధి పొందే వారు, కూలీ పనులు చేసుకొని బతికే చాలా మంది లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని స్వస్థలాలకు పయనమవుతున్నారు. 
 
హైదరాబాద్, -విజయవాడ జాతీయ రహదారిలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సాయంత్రం 7 గంటల వరకే అనుమతి ఉండటంతో సరిహద్దు వద్ద అధికారులు వాహనాలను నిలిపి వేస్తున్నారు. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. 
 
ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, లాసెట్, పిజిఎల్ సెట్, పిఇసెట్, ఎడ్ సెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో లాక్ డౌన్ తప్పదనే భావనతో ప్రజలు స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. 
 
 చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ కు వాహనాల తాకిడి ఎక్కువయింది. చేసేందుకు పనిలేక, తినడానికి తిండిలేక, ఇంటి నెలవారీ అద్దె చెల్లించలేక తట్టా బుట్టా సర్దుకుని స్వగ్రామాలకు బయలు దేరారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఇంటి సామాన్లను వాహనాల్లో సర్దుకుని ఎపికి బయలు దేరిన పలు దృశ్యాలు పంతంగి టోల్‌గేట్ వద్ద కనిపించాయి.