తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం 

 తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి పడినదని విచారం వ్యక్తం చేశారు. నాణ్యత లేని ప్రోజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్  సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటె మిగితా చోట్ల ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో అని ప్రశ్నించారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారనడానికి కొండపోచమ్మ కాలువకు పడిన గండే సాక్ష్యం అని మంది పడ్డారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 
కొండపోచమ్మ సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడి కాలువకు గండి పడింది. మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద గండి పడటంతో గ్రామంలోకి నీరు చేరింది. ఉదయం 7 గంటల సమయంలో కాలువకు గండి పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని సంజయ్ విమర్శించారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణమని దుయ్యబట్టారు.
నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి, కఠిన చర్యలు చేపట్టాలని సంజయ్ డిమాండ్  చేశారు. కాంట్రాక్టర్ నుండి ఈ మొత్తాన్ని రికవర్ చేసి తక్షణమే మరమత్తు పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. నాణ్యత లేని పనులు చేపడుతుంటే విజిలెన్సు, నాణ్యత నియంత్రణ విభాగాలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు.  ప్రోజెక్టుల పేరు మీద నాణ్యత లేని పనులు చేపట్టి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.