కరోనా పరీక్షలు చేయకుండా జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వంపై హై కోర్ట్ మరోసారి మండిపడింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం ఎంత మందికి పరీక్షలు చేశారు? ఆ రోజు హైదరాబాద్‌లో టెస్ట్‌లు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనా మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు..10 నిమిషాల్లో రిపోర్టులు వచ్చే పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్రం బృందం ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశాలను ఈనెల 17న సమర్పించాలని తెలిపింది. జులై 17న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, దానిపై సంతృప్తి చెందకపోతే జులై 26న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు హెచ్చరించింది.
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 16,339 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,294 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. 260 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,785 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
More Stories
తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం
వర్గీకరణకు కమిషన్ పేరుతో ఉద్యోగ భర్తీకి ఎగనామం!
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్