చైనా నిరంకుశ పాలన కిందకు పూర్తిగా హాంకాంగ్ 

హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. హాంకాంగ్‌లో వేర్పాటువాద కార్యకలాపాలను అణచివేసేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. చైనా కమ్యూనిష్టు పార్టీ, హాంకాంగ్ స్థానిక ప్రభుత్వానికి మధ్య అధికారాల విభజనను ఇది తొలగిస్తుంది. చైనా నిరంకుశ పాలన కిందకు హాంకాంగ్ పూర్తిగా వచ్చిన్నట్లయింది.  
 
చట్టం కార్యరూపం దాల్చినట్టు చైనా జాతీయ కాంగ్రెస్ స్థాయీ సంఘంలో హాంకాంగ్  ప్రతినిధి ట్యామ్ యివుచుంగ్ మంగళవారం వెల్లడించారు. ఉద్రిక్తతలు సృష్టిస్తున్నవారిని అదుపులో ఉంచేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
మరణశిక్ష మినహా మిగతా శిక్షల గురించే చట్టంలో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. అయితే వివరాలిచ్చేందుకు నిరాకరించారు.  దేశాన్ని విభజించేందుకు హాంకాంగ్‌ను ఓ పని ముట్టుగా వాడుకోవడాన్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. 
 
కమ్యూనిస్ట్ పాలకుల హెచ్చరికల నేపథ్యంలో ఉద్యమ సంస్థ డెమోసిస్టో తమ కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించింది. 1997లో హాంకాంగ్‌పై అధికారాలు బ్రిటన్ చేతుల్లోంచి చైనాకు బదిలీ అయ్యాయి. బ్రిటన్, చైనాల మధ్య గత ఒప్పందంలో భాగంగా అది జరిగింది. చైనా ఆధీనంలోని హాంకాంగ్ ఇప్పటి వరకూ పాక్షిక స్వయంప్రతిపత్తి దేశంగా మనగలుగుతూ వచ్చింది. 
 
ఈ కొత్త చట్టం ద్వారా హాంకాంగ్‌పై పూర్తి అధికారాలకు చైనా మార్గం సుగమమం చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. కాగా, హాంకాంగ్‌పై అధికారాలు చేజిక్కించుకునే సమయంలో ఇచ్చిన హామీకి చైనా కట్టుబడి ఉండటం లేదన్న విమర్శలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి.
 
ఒక దేశం, రెండు వ్యవస్థలుగా కనీసం 2047 వరకు హాంకాంగ్ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించబోమని చైనా ఆ సమయంలో హామీ ఇచ్చింది. నూతన చట్టంతో ప్రజాస్వామిక ఉద్యమకారులు ఆందోళన చెందుతున్నారు. డెమోసిస్టో నుంచి తాము వైదొలుగుతున్నట్టు జోషువా వాంగ్, ఆగ్నెస్‌చౌ, నాథన్‌లా ప్రకటించారు. 
 
వేర్పాటు ఉద్యమాల్లో పాల్గొన్నందుకు చైనా జైళ్లలో దీర్ఘ కాలిక శిక్షలు అనుభవించాల్సి వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ముఖ్యనేతలే తప్పుకోవడంతో తమ కార్యకలాపాల్ని నిలిపి వేస్తున్నట్టు డెమోసిస్టో ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది. 
 
చైనా చర్య అటు తైవాన్‌నూ ఆందోళనకు గురి చేస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని, బలవంతంగానైనా దానిని కలుపుకొని తీరుతామని చైనా పాలకులు ఇప్పటికే ప్రకటించారు. చైనా తీసుకొచ్చిన చట్టం పట్ల అమెరికా, బ్రిటన్ నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి.
 
ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్తామని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు. చైనా మాత్రం ఇది తమ అంతర్గత సమస్య అంటూ కొట్టి పారేస్తోంది.