కరోనా మహమ్మారితో ఇప్పటికే యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ చైనాకు చెందిన పరిశోధకులు భవిష్యత్తులో మరో మహమ్మారిగా పరిణమించే ప్రమాదమున్న స్వైన్‌ఫ్లూ రకం వైరస్‌ను చైనాలో గుర్తించినట్లు వెల్లడించారు. అమెరికాలోని పీఎన్‌ఏఎస్ సైన్స్ జర్నల్‌లో వారు తమ అధ్యయన వివరాలను ప్రచురించారు.
కొత్తగా కనుగొన్న వైరస్‌కు జీ4 అని పేరుపెట్టారు. 2009లో ప్రపంచాన్ని వణికించిన హెచ్1ఎన్1 జాతి వైరసే దీనికి మూలమని ‘చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రినెన్షన్’కు చెందిన పరిశోధకులు తెలిపారు. మనుషులకు సంక్రమించడానికి కారణమయ్యే అన్ని లక్షణాలు ఈ వైరస్‌కు ఉన్నాయని చెప్పారు.
అధ్యయనంలో భాగంగా, 2011-18 మధ్యకాలంలో చైనాలోని పది రాష్ర్టాల్లో ఉన్న జంతువధశాలలు, వెటర్నరీ దవాఖానలలో ఉన్న పందుల నుంచి 30,000 నమూనాలను సేకరించారు. వీటిపై అధ్యయనం జరుపగా ఏకంగా 179 స్వైన్‌ఫ్లూ వైరస్‌లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వీటితో ఫెర్రెట్‌లపై (ముంగిస లాంటి జంతువు) ప్రయోగాలు జరిపారు.
ఫ్లూ వైరస్‌పై అధ్యయానికి ఫెర్రెట్‌లనే వినియోగిస్తుంటారు. ఎందుకంటే వైరస్ సోకినప్పుడు మనుషులలో కనిపించే లక్షణాలే వీటిలోనూ కనిపిస్తుంటాయి. ఇతర వైరస్‌ల కంటే జీ4 వైరస్ ఫెర్రెట్‌లలో ప్రమాదకర లక్షణాలను కలుగజేసినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేగాకుండా, పందుల పరిశ్రమలలో పనిచేసే కార్మికుల్లో 10.4% మందికి ఇప్పటికే ఈ వైరస్ సంక్రమించినట్లు యాంటీ బాడీ పరీక్షల ద్వారా కనుగొన్నారు.
అలాగే సీజనల్ ఫ్లూతో మనుషుల్లో అభివృద్ధి చెందిన రోగ నిరోధకత జీ4 నుంచి రక్షణ ఇవ్వలేదని కూడా పరిశోధకులు తెలిపారు. కాగా, ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ వ్యాపిస్తే మరో మహమ్మారి ముప్పు పొంచి ఉన్నట్లేనని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
More Stories
పారాలింపిక్స్‌లో 18వ స్థానంలో భారత్
రష్యా, చైనా కీలక అధికారులతో అజిత్ దోవల్ భేటీ
కార్గిల్ యుద్ధం చేసింది మేమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ సైన్యం