తూర్పు లడఖ్ లో 20 వేలమంది చైనా సైనికులు   

తూర్పు ల‌డ‌ఖ్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.  అక్క‌డ ఉన్న వాస్త‌వాధీన రేఖ వెంట సుమారు 20 వేల మంది సైనికుల‌ను చైనా మోహ‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా అద‌నంగా జిన్‌జియాంగ్ రాష్ట్రంలో మ‌రో 12 వేల ద‌ళాలు సంసిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది.

ఈ ద‌ళాలు 48 గంట‌ల్లోనే వాస్త‌వాధీన రేఖ‌కు చేరుకునే విధంగా వాహ‌నాల‌తో రెఢీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్ సెక్టార్‌లో రెండు డివిజ‌న్ల పీఎల్ఏ ద‌ళాలు ఉన్న‌ట్లు ఓ ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించారు.

వాస్త‌వాధీన రేఖ‌కు మ‌రో వెయ్యి కిలోమీట‌ర్ల దూరంలో కూడా చైనా ప్ర‌త్యేక బ‌ల‌గాలు ప‌హారా కాస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించారు. భార‌తీయ భూభాగానికి స‌మీపంగా సైన్యాన్ని మోహ‌రిస్తున్న చైనా క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్న‌ట్లు ఆ అధికారి తెలిపారు.

స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌ల‌పై గ‌త ఆరు వారాల నుంచి రెండు దేశాల సైనికుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. గాల్వ‌న్ ఘ‌ట‌న త‌ర్వాత కూడా రెండు ద‌ఫాల చర్చ‌లు చోటుచేసుకున్నాయి. అయినా స‌రిహ‌ద్దు ప్ర‌తిష్టంభ‌న తొల‌గ‌డం లేదు.

టిబెట్ ప్రాంతంలో సాధార‌ణంగా రెండు డివిజ‌న్ల చైనా ద‌ళాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈ సారి మ‌రో రెండు అద‌న‌పు డివిజ‌న్ల ద‌ళాల‌ను సుమారు రెండు వేల కిలోమీట‌ర్ల దూరం నుంచి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఆ దళాల్లో రిజ‌ర్వ్ మౌంటేన్ డివిజ‌న్ ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతున్న‌ది. యుద్ధ‌విన్యాసాల్లో పాల్గొనే ఆ ద‌ళాలు ప్ర‌స్తుతం వాస్త‌వాధీన రేఖ దిశ‌గా క‌దులుతున్నాయి.

ఇలా ఉండగా, లడాఖ్‌ లేక్‌ దగ్గర చైనాకు సమాధానం చెప్పేందుకు మన దేశం హై పవర్‌‌ బోట్స్‌ను మోహరిస్తోంది. లడాఖ్‌ లేక్‌ దగ్గర పెట్రోలింగ్‌కు చైనా వాడుతున్న చైనీస్‌ వెజల్స్‌కు చెక్‌ పేట్టేందుకు వీటిని దించుతున్నట్లు తెలుస్తోంది.