కరాచీలోని ‘పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్’ (పీఎస్‌ఎక్స్) భవనంపై సోమవారం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు సహా నలుగురు సెక్యూరిటీ గార్డ్స్, ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
పాకిస్థాన్ వాల్‌స్ట్రీట్‌గా పిలిచే ఐ.ఐ.చుందరీగర్ రోడ్‌లో ఉన్న పీఎస్‌ఎక్స్ భవనం వద్దకు ఓ కారులో వచ్చిన నలుగురు ముష్కరులు పార్కింగ్ ఏరియా నుంచి భవనం కాంపౌండ్ లోపలికి ప్రవేశించేందుకు యత్నించారని డీఎస్పీ జమీల్ అహ్మద్ తెలిపారు. తొలుత గ్రనేడ్లు విసిరి, అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు చెప్పారు.
అయితే ఒక ఉగ్రవాది హతం కావడంతో వారు వెనక్కి తగ్గినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు, రేంజర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించారు. ఉగ్రదాడి జరిగిన సమయంలోనూ ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగాయని చెప్పారు.
పాకిస్థాన్ రేంజర్స్ సింధ్ చీఫ్ మేజర్ జనరల్ ఒమర్ అహ్మద్ బొఖారీ మీడియాతో మాట్లాడుతూ.. ముష్కరులు పీఎస్‌ఎక్స్‌లో రక్తపాతం సృష్టించడంతోపాటు ప్రజలను నిర్బంధించేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ప్రతి ఉగ్రవాది వద్ద ఏకే 47 గన్‌లు, గ్రనేడ్లు, రాకెట్ లాంచర్లతోపాటు ఆహార పదార్థాలు కూడా ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై పాక్ అధ్యక్షుడు అరిఫ్ అలీ, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఉగ్రదాడికి తామే పాల్పడినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)తో సంబంధమున్న మజీద్ బ్రిగేడ్ ప్రకటించింది. ఈ సంస్థపై పాకిస్థాన్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌లలో నిషేధం ఉన్నది.
More Stories
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా