ట్రంప్ అరెస్టుకు ఇరాన్ వారెంట్ జారీ

ట్రంప్ అరెస్టుకు ఇరాన్ వారెంట్ జారీ

గత జనవరి 3న బాగ్దాద్‌లో జరిగిన డ్రోన్ దాడిలో జనరల్ కాసిం సోలైమని హత్యలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు మరో 30 మందికి ఇరాన్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈమేరకు ట్రంప్‌తో పాటు మిగతా నిందితులను నిర్బంధించడానికి సహకరించాలని ఇంటర్‌పోల్‌ను కోరింది. 

టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలి అల్కసిమెహర్ దీనిపై వివరిస్తూ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని చెప్పారు. అయితే ఫ్రాన్స్ లోని లయాన్ కేంద్రమైన ఇంటర్‌పోల్ తక్షణం దీనిపై వ్యాఖ్యానించడానికి స్పందించలేదు.

ట్రంప్‌తోపాటు మిగతా వారు ఉన్నత స్థానాల్లో ఉన్నందున వారిపై రెడ్ నోటీస్ జారీ చేయాలని ఇరాన్ ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించినట్టు ప్రాసిక్యూటర్ చెప్పారు. ఇరాన్ అభ్యర్థనపై ఇంటర్‌పోల్ తన కమిటీతో ఈ సమాచారం సభ్య దేశాలకు తెలియచేయాలా వద్దా అని చర్చించ వలసి ఉంటుంది. 

ఇటువంటి నోటీసులను బహిర్గత పరిచే అవకాశం ఇంటర్‌పోల్‌కు లేదు. మార్గదర్శకాల ప్రకారం ఇరాన్ అభ్యర్థనను ఇంటర్‌పోల్ స్వీకరించక పోవచ్చు. రాజకీయాలతో ముడిపడి ఉన్న జోక్యం లేదా చర్యలపై వచ్చే నోటీసులను తీసుకోరాదని నిషేధం ఉంది.