ప్రపంచంలో కోటి దాటిన కరోనా రోగులు 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటింది. ఆదివారం నాటికి 1,00,86,969 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. చైనాలోని వుహాన్‌ నగరంలో గత ఏడాది డిసెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ ప్రభలిన నాటి నుంచి ఆరు నెలల్లోనే కేసుల సంఖ్య ఈ మేరకు పెరిగింది. 

వైరస్‌ వ్యాప్తి వేసవి కాలంలో తగ్గుతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నది. మే, జూన్‌ నెలల్లో కరోనా కేసుల ఉధృతి మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ కొత్తగా 1.25 లక్షల వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాతోపాటు కెనడా కరోనా వల్ల బాగా ప్రభావితమయ్యాయి. అమెరికాలో ప్రతిరోజు 40 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్‌, పెరూ, చిలీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 12,75,000 దాటగా మరణాల సంఖ్య 56 వేలకుపైగా ఉన్నది.

ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ మరణాల సంఖ్య 5 లక్షల మార్కును దాటింది. ఒక్క మార్చి నెలలోనే సుమారు 1.9 లక్షల మంది వైరస్‌ బారినపడి చనిపోయారు. గత రెండు నెలలుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాలు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలు కరోనా మహమ్మారిని జయించాయి. తమ దేశం పూర్తిగా కరోనా రహితమని న్యూజిలాండ్ గతవారం ప్రకటించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ దేశంలో తాజాగా పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూశాయి. భారత్‌కు పొరుగున్న ఉన్న భూటాన్‌, శ్రీలంక దేశాలు కూడా కరోనా రహితంగా ప్రకటించుకున్నాయి.