తెలంగాణలో భారీ కరోనా కేసులతో లాబ్స్ బంద్!

తెలంగాణలో కొత్తగా ఒకే రోజు  1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయి, ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 13,436 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మొత్తం 243 మంది మృతి చెందారు. 

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది రోజులలో 50,000 టెస్టులు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత వరుసగా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దానితో రాష్ట్రంలో కరోనా కట్టడిలో ఉన్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం డొల్లతనం వెల్లడైనది. 

  టెస్టులు చేయించుకుంటున్న ప్రతి నలుగురైదుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.   దానితో వెంటనే  ప్రభుత్వ ల్యాబ్ లు పడక వేయడం, ప్రైవేట్ ల్యాబ్ లను సహితం మూత వేయించే ప్రయత్నం చేస్తుంటే  కరోనా టెస్ట్ లకు కేసీఆర్ ప్రభుత్వం మంగళం పాడనున్నట్లు వెల్లడవుతుంది.

ప్రభుత్వ ల్యాబ్ లలో నమూనాలు పేరుకు పోవడంతో మూడు, నాలుగు రోజులుగా కొత్తగా నమూనాలను తీసుకోవడం లేదు. వైరస్ లక్షణాలతో వచ్చినోళ్లను కూడా వెనక్కి తిప్పి పంపుతున్నారు. 

మరోవంక  ప్రైవేటు ల్యాబ్​ లకు టెస్ట్ లు జరపడానికి అనుమతిచ్చిన ప్రభుత్వం పది రోజులలోనే నిపుణుల కమిటీతో తనిఖీ చేయించి అక్కడ నిబంధనలు పాటించడం లేదని అంటూ వంకలు పెడుతున్నది. వాటిని మూయించడం కోసమే అన్నట్లు పలువురు భావిస్తున్నారు.

ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్ట్ లు సరిగ్గా చేయడం లేదని,  వైరస్ లేనోళ్లకు కూడా ఉన్నట్టు రిపోర్టులు ఇస్తున్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో టెస్టుల కోసం ఎక్కడికి పోవాలో తెలియక జనం తలలు పట్టుకుంటున్నరు. ప్రభుత్వ దవాఖాన్లలో ఉన్న అధ్వాన పరిస్థితి గురించి, డాక్టర్లు, సిబ్బంది కొరత గురించి ఎన్నడూ మాట్లాడని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్​ల్లో పరిశుభ్రత లేదని గుర్తించినట్లు ప్రకటించింది.

ఏడాది కిందట డెంగీ, క్లినికల్‌‌ ట్రయల్స్‌‌పై వేసిన కమిటీ రిపోర్టులను ఇప్పటికీ వెల్లడించని ప్రభుత్వం   ప్రైవేటు ల్యాబ్​ల్లో లోపాలను గుర్తిస్తూ నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను మాత్రం మీడియాకు విడుదల చేయడం విస్మయం కలిగిస్తుంది. కరోనా టెస్టులు చేస్తున్న 18 ప్రైవేటు ల్యాబ్​లలో 16 ల్యాబ్​లను కమిటీ ఇన్‌‌స్పెక్షన్ చేసి  నిబంధనలు పాటించడం లేదని పేర్కొంది.

ల్యాబ్​లు నీట్‌‌గా లేవని, తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వలేదని, వాళ్లు పీపీఈ కిట్లు వేసుకోవడం లేదని, టెస్ట్‌‌ కోసం వచ్చే వారికి కరోనా సోకే ప్రమాదం ఉందని, టెస్టుల సంఖ్య తప్పుగా చెప్తున్నారని ఆరోపించింది. అయితే ఇన్ని లోపాలున్న ల్యాబ్​ల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

ప్రైవేటు ల్యాబ్​ల్లో టెక్నీషియన్లకు ట్రైనింగ్ ఇవ్వలేదని చెబుతున్న ఆరోగ్యశాఖ అసలు ప్రభుత్వ ల్యాబ్​ల్లో పరిస్థితి ఏంటని సర్కారు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రశ్నిస్తున్నారు. తమతో రోజుకు 12 గంటలు డ్యూటీ చేయిస్తూ, పని భారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు.

సర్కార్ దవాఖాన్లలో 1,060 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులుంటే 562 ఖాళీగానే ఉన్నాయి. 498 మంది పనిచేస్తుండగా, ఇందులో 290 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. ఇప్పటికే టెక్నీషియన్లు లేక చాలా దవాఖాన్లలో డయాగ్నసిస్ యంత్రాలు మూలబడ్డాయి.

టెస్ట్ లు సరిగ్గా చేయడం లేదని ఫిర్యాదుల వెల్లువ వెలువడంతో కేంద్రం ఎక్కడ జోక్యం చేసుకొంటుందో అని కేసీఆర్ హడావుడిగా  గ్రేటర్ చుట్టుపక్కల 30 నియోజకవర్గాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు ల్యాబ్​లలోనూ టెస్టులకు అనుమతి  ఇచ్చారు. అప్పటినుంచి కేసుల సంఖ్య పెరిగింది.