రక్తం అవసరమైతే ఈబ్ల‌డ్‌స‌ర్వీసెస్ యాప్‌  

ఈబ్ల‌డ్‌స‌ర్వీసెస్ యాప్‌ను కేంద్ర ఆరోగ్య‌శాక మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఆవిష్క‌రించారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ ఈ యాప్‌ను తీసుకువ‌చ్చింది. ర‌క్తం అవ‌స‌రం ఉన్న‌వారు ఈ యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తెలిపారు. 

యాప్‌లో రిజిస్ట‌ర్ అయిన వారు ర‌క్తాన్ని డిమాండ్ చేయ‌వచ్చు అని, వారికి నాలుగు యూనిట్ల ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తార‌ని పేర్కొన్నారు.  ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ ర‌క్తం అవ‌స‌రం అయిన వారికి స‌హాయం చేస్తుంద‌ని మంత్రి తెలిపారు.  మ‌హ‌మ్మారి వేళ దాతలు ర‌క్త‌దానం చేయాల‌ని మంత్రి అభ్య‌ర్థించారు.

క‌రోనా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఈబ్ల‌డ్‌స‌ర్వీస్ యాప్ ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని మంత్రి తెలిపారు. సీ-డీసీకి చెందిన ఈర‌క్త‌కోశ్ బృందం ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ర‌క్త‌దాన ప్ర‌క్రియ‌లో ఈ యాప్ ద్వారా పార‌దర్శ‌క‌త తీసుకురావ‌చ్చు అని మంత్రి తెలిపారు. 

ఒక‌సారి ఎవ‌రైనా ర‌క్తం కావాల‌ని ఈ యాప్‌లో రిక్వెస్ట్ చేస్తే,  ఆ అభ్య‌ర్థ ఐఆర్‌సీఎల్ ఎన్‌హెచ్‌క్యూ బ్ల‌డ్ బ్యాంక్‌కు తెలుస్తుంది. దీంతో అనుకున్న స‌మ‌యంలోపే ర‌క్తాన్ని చేరవేసే వీలు ఉంటుంది. ర‌క్త‌గ్రహీత‌ల‌కు స‌మ‌యం కూడా మిగులుతుంద‌ని అధికారులు చెప్పారు.

ఈబ్ల‌డ్‌స‌ర్వీసెస్ మొబైల్ యాప్‌లో ఫీచ‌ర్లు చాలా సులువుగా ఉన్నాయ‌ని, ఈ యాప్ ద్వారా ర‌క్తం కోసం చాలా ఈజీగా అభ్య‌ర్థ‌న చేయ‌వచ్చు అని మంత్రి తెలిపారు.