అంతరిక్ష రంగంలో నూతన మలుపు 

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మౌలిక సదుపాయాలను ప్రయివేటు సంస్థలు కూడా వినియోగించుకునేందుకు పచ్చజెండా ఊపింది. 
 
అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించేందుకు మార్గనిర్దేశం చేయడానికి భారత జాతీయ అంతరిక్ష, అభివఅద్ధి, అధికార కేంద్రం (ఇన్‌-స్పేస్‌)ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర అణు విద్యుత్‌, అంతరిక్ష సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో విధానాల తయారీకి దోహదం చేస్తుందని చెప్పారు. 
 
ఇస్రో మౌలిక సదుపాయాలను ప్రైవేట్‌ సంస్థలు ఉపయోగించుకునేందుకు వీలుగా ఇన్‌-స్పేస్‌ సంస్థను మారుస్తామని తెలిపారు. ఇన్‌-స్పేస్‌ కొత్తదేమీ కాదని ఇంతకు ముందే ఉందని, ఇప్పుడు ఇస్రోలో దాని పాత్రను విస్తరిస్తున్నామని చెప్పారు. 
 
అంతరిక్ష విభాగంలో ఇదొక నూతన మలుపుగా ఆయన చెప్పుకొచ్చారు. రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయని, ఒకదాని పరిధిలోకి మరొకటి రాదని స్పష్టం చేశారు. ఇస్రో ఎప్పటిలాగే తన కార్యకలాపాలు నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. అయితే ఇస్రో ప్రాజెక్టులు, మిషన్లు కొనసాగుతాయని,  నిర్ణయాధికారం దానికే ఉంటుందని స్పష్టం చేశారు.