కరొనతో తగ్గనున్న ఆర్ధిక అసమానతలు  

కరోనా సంక్షోభానంతరం దేశంలో పేద రాష్ట్రాల  కంటే ధనిక రాష్ర్టాల ఆదాయం అధికంగా తగ్గే అవకాశాలున్నాయని ఎస్బీఐ అభిప్రాయపడింది. ఫలితంగా ఆర్థిక అసమానతలు తగ్గవచ్చని తెలిపింది.
 
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయి తలసరి ఆదాయం (పీసీఐ) 5.4 శాతం మేరకు తగ్గి రూ.1.43 లక్షలకు చేరుకోవచ్చని ఎస్బీఐ తన తాజా సర్వే నివేదిక ‘ఎకోవ్రాప్‌’లో అంచనా వేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని స్పష్టం చేసింది. 
 
నివేదికలోని ముఖ్యాంశాలు
 
* స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నామమాత్రపు తగ్గుదల (3.8 శాతం) కంటే పీసీఐ క్షీణత అధికంగా ఉండవచ్చు.
* ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తలసరి జీడీపీ 6.2 శాతం క్షీణిస్తుంది. ఇది ప్రపంచ వాస్తవిక జీడీపీ తగ్గుదల (5.2 శాతం) కంటే తక్కువగా ఉంటుంది. 
* పీసీఐ పరంగా సంపన్న రాష్ట్రాలు  (దేశ సగటు కంటే ఎక్కువ తలసరి ఆదాయమున్న రాష్ట్రాలు) అధికంగా ప్రభావితమవుతాయి.
* పీసీఐ క్షీణత ఢిల్లీ (-15.4%), చండీగఢ్‌ (-13.9%)లో అధికంగా నమోదు కావచ్చు. 
* మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీసీఐ క్షీణత రెండంకెల్లో ఉండవచ్చు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులో పీసీఐ 12% మేరకు తగ్గే అవకాశం ఉన్నది.
*మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో పీసీఐ 8 శాతం కంటే తక్కువగా నమోదు కావచ్చు.
*ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.8 శాతం క్షీణతను నమోదు చేయవచ్చు.
*దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19కు ముందున్న స్థాయికి చేరేందుకు కనీసం 2024 ఆర్థిక సంవత్సరం వరకు సమయం పట్టవచ్చు.