చైనాతో రూ 5,000 కోట్ల ప్రాజెక్ట్ లకు ఉద్ధవ్ బ్రేక్ 

మహారాష్ట్ర ప్రభుత్వం చైనాకు భారీ షాక్‌ ఇచ్చింది. రూ.5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను నిలిపివేసింది. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను, ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టేందుకు ’మ్యాగ్నటిక్‌ మహారాష్ట్ర 2.0’కు సంకీర్ణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోని పలు కంపెనీలతోపాటు అమెరికా, సింగపూర్‌, దక్షిణ కొరియా, 

చైనాకు చెందిన సంస్థలతో 12 ఒప్పందాలు చేసుకున్నది. మూడు చైనా కంపెనీలైన హెంగ్లీ ఇంజనీరింగ్, పిఎమ్‌ఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ జెవి విత్ ఫోటాన్, గ్రేట్ వాల్ మోటార్స్‌తో పూణే జిల్లాలోని తలేగావ్‌లో పెట్టుబడులు పెట్టడానికి జూన్‌ 17న మూడు ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకున్నది.

అయితే లఢక్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15-16 తేదీల్లో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి.

చైనా వస్తువులతోపాటు ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ ఊపందుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో మూడు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న రూ. 5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

ఇప్పటికే చైనా కంపెనీతో కుదుర్చుకున్న రూ.470 కోట్ల సిగ్నల్‌ కాంట్రాక్టును రైల్వే శాఖ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడాలని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌తోపాటు అన్ని టెలికాం సంస్థలకు టెలికాం మంత్రిత్వశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.