కరోనా డ్రగ్ విడుదల చేసిన హెటిరో

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ హెటిరో క‌రోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది.  కోవిడ్‌-19 చికిత్సకు   యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్‌‌‌` ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం  డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి   అనుమ‌తి పొందిన‌ట్లు కంపెనీ వెల్లడించింది. 

రెమిడిసివిర్   జెనెరిక్ వెర్షన్‌ను భారత్‌లో `కోవిఫర్‌`  పేరుతో  విడుదల చేసేందుకు సిద్ధమైంది.   కోవిడ్‌-19 చికిత్సలో  యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమిడిసివిర్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమైన కేసుల్లోనే తక్కువ డోస్‌లో రెమిడిసివిర్‌ వాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

హెటిరో  ఛైర్మన్‌ డాక్టర్‌  బి. పార్థసారథి రెడ్డి   మాట్లాడుతూ ‘భారత్‌లో కోవిడ్‌-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న త‌రుణంలో `కోవిఫ‌ర్‌`( రెమిడిసివిర్‌‌) విజ‌య‌వంతంగా క్లినిక‌ల్ ట్రయల్స్‌  పూర్తి చేసుకొని అందుబాటులోకి రావ‌డం గేమ్ చేంజ‌ర్‌గా మార‌నుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఔషధాన్ని ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం”అని చెప్పారు. 

కోవిడ్‌-19పై పోరాటంలో ప్రభుత్వం, వైద్య విభాగాలతో నిరంతరం కలిసి పనిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.  ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు మేక్‌ ఇన్‌ ఇండియా క్యాంపెయిన్‌లో  భాగంగా ఈ ఔషధాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు.  ఇంజక్షన్‌ రూపంలో ‘కోవిఫర్‌ 100 ఎంజీ’ మార్కెట్‌లోకి రానుందని   కంపెనీ పేర్కొంది.