చైనా వస్తూత్పత్తులు కొనే ముచ్చటే లేదు 

సరిహద్దుల్లో చైనా దుశ్చర్య నేపథ్యంలో ఆ దేశ వస్తూత్పత్తులను కొనే ముచ్చటే లేదని ఓ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 87 శాతం మంది తేల్చిచెప్పారు. 20 మంది సైనికులను బలిగొన్న చైనాకు వాణిజ్యపరంగా బుద్ధి చెప్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే చైనా కంపెనీలు తయారు చేసిన ఏ వస్తువు జోలికీ ఏడాదిదాకా వెళ్లబోమని స్పష్టం చేశారు. షియామీ, వివో, ఒప్పో వంటి చైనా బ్రాండ్లను బహిష్కరించాలని 97 శాతం మంది కోరగా, 39 శాతం మంది ఇప్పటికే కొన్నవి వాడుతామని, ఇకపై మాత్రం కొనబోమని తేల్చి చెప్పా రు.

చైనా దిగుమతులపై 200 శాతం సుంకాలను విధించాలని 78 శాతం భారతీయులు డిమాండ్‌ చేయగా, ముడి సరుకు దిగుమతులపై ఇంతటి భారం తగదని 36 శాతం అభిప్రాయపడ్డారు.

బీఐఎస్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తదితర భారతీయ ప్రమాణాలను చైనా కంపెనీలు తప్పక పాటించాల్సిందేనని 90 శాతం మంది చెప్పారు. దేశంలోని 235 జిల్లాల్లో లోకల్‌ సర్కిల్స్‌ ఈ సర్వే చేపట్టగా, 32వేల మందికిపైగా పాల్గొన్నారు.