తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న భూప్రకంపనలు 

తెలుగు రాష్ట్రాల్లో భూ క్రమపానాలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధాలు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. 

రిక్టర్ స్కేలుపై కృష్ణా జిల్లాలో ప్రకంపనల తీవ్రత 2.2 గా నమోదైందని అధికారులు వెల్లడించారు. పాత నల్లగొండ జిల్లా చింతలపాలెం, మేళ్లచెరువులో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. సహజంగా భూమి లోపలి పొరల్లో కదలికలు వస్తూనే ఉంటాయనీ, ఆ కదలికల్లో తేడా వచ్చినప్పుడు భూమి కంపిస్తుందని అధికారులు తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలు లేవని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చింతలపాలెం మండలంలో నాలుగుసార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనలతో జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్పై 3గా నమోదయ్యిందని, చింతలపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తహశీల్దార్ కమలాకర్ తెలిపారు.