లఢక్ సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారతీయ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి పెరిగింది. చైనా ప్రభుత్వానికి సంబంధించిన పలు హ్యాకర్ బృందాలు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పలు ప్రభుత్వ శాఖలతోపాటు, వ్యాపార, మీడియా సంస్థలపై హ్యాకర్లు దాడులు చేస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.
రక్షణ మంత్రిత్వ శాఖ, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్, మైక్రోమాక్స్, సిప్లా, సన్ ఫార్మా, ఎంఆర్‌ఎఫ్, ఎల్ అండ్ టి వంటి సంస్థలను చైనా హ్యాకర్ గ్రూపులు లక్ష్యంగా పెట్టుకున్నాయని సింగపూర్‌కు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైఫిర్మా రీసెర్చ్ తెలిపింది.
వాణిజ్య రహస్యాలతో సహా సున్నితమైన సమాచారంపై నిఘా పెట్టి వాటిని హ్యాక్ చేయడం ద్వారా ఆయా సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలతోపాటు టెలికాం, ఫార్మా, మీడియా సంస్థలు, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, నిర్మాణం వంటి పలు రంగాలకు చెందిన కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సైఫిర్మా రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
పలు దేశాల్లో సైబర్ దాడులకు పాల్పడిన అనుభవం ఈ హ్యాకర్లకు ఉన్నదని పేర్కొంది. హ్యాకర్ల కార్యకలాపాలు, ఐపీ అడ్రస్‌లపై విశ్లేషణ జరిపిన అనంతరం చైనా ప్రభుత్వంతో సంబంధమున్న గోతిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకర్లు ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం