వ‌ర్క్ వీసాల ర‌ద్దుతో అమెరికాకే నష్టం

అమెరికాలో స్థానికుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వర్క్‌ వీసాల జారీని రద్దు చేయడం తప్పుడు నిర్ణయమని నాస్కామ్‌ పేర్కొన్నది. వ‌ర్క్ వీసాల ర‌ద్దుపై అమెరికాలో కొత్త సమస్యలు ఉత్పన్నమై ఆ దేశ ఆర్థికవ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

అమెరికన్లలో అవ‌స‌రానికి స‌రిప‌డా నిపుణులు లేక‌పోవ‌డంతో అక్కడి ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చాలా మేరకు విదేశాలకు తరలించే అవకాశమున్నదని నాస్కామ్‌ హెచ్చరించింది. 

అమెరికాలో ప‌లు ఆస్ప‌త్రులు, ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సంస్థలతోపాటు వేలాది వ్యాపార సంస్థలకు నాస్కామ్‌ సభ్యులు అత్యవసర సేవలను అందజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. 

ఈ ఏడాది చివ‌రిక‌ల్లా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డం కోసం అధ్య‌క్షుడు ట్రంప్ అన్ని ర‌కాల వ‌ర్క్ వీసాలను ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు స‌స్పెండ్ చేశారు.