పాక్ ఎంబసిలో సగం సిబ్బంది తగ్గించండి 

న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమీషన్ కార్యాల‌యంలో 50 శాతం మంది సిబ్బందిని త‌గ్గించాల‌ని భార‌త్‌ పాక్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం వారం రోజుల గ‌డువు విధించింది. అలాగే తాము కూడా ఇస్లామాబాద్ లోని భారత హై కమీషన్ కార్యాలయంలో నుంచి 50 శాతం సిబ్బందిని తిరిగి వెన‌క్కు ర‌ప్పిస్తామ‌ని తెలిపింది. 

పాక్ అధికారులు భార‌త్‌లో గూఢ‌చ‌ర్యం చేస్తూ ఉగ్ర‌వాద సంస్థ‌తో సంబంధాల‌ను కొన‌సాగించ‌డంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ‌ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. పాక్ ప్ర‌వ‌ర్త‌న వియ‌న్నా ఒప్పందం, ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ద్వైపాక్షిక‌ ఒప్పందాల‌కు విరుద్ధంగా ఉంద‌ని పాకిస్థాన్ ఛార్జ్ డి అఫైర్స్‌కు తెలిపింది. పాక్ చ‌ర్య‌లు ఉగ్ర‌వాదం, హింస‌కు ప్రోత్సాహం ఇస్తున్న‌ట్లున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇస్లామాబాద్‌లో ఇద్ద‌రు భార‌త‌ హై క‌మిష‌న్ అధికారుల‌ను అప‌హ‌రించి వారిని అనారోగ్యానికి గురి చేసి పాక్ ఎంత దూరం వెళ్లిందో తెలుస్తోంద‌ని చెప్పుకొచ్చింది. ఇటు భార‌త్‌లోనూ పాక్ అధికారులు ఉగ్ర‌వాద సంస్థ‌తో సంబంధాలు కొన‌సాగించిన అంశాన్ని గుర్తు చేసింది. 
 
మే 31న‌ ఇద్ద‌రు పాక్‌ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల హై క‌మిష‌న్ కార్యాల‌యాల్లో యాభై శాతం సిబ్బంది తొల‌గించాల్సిందేనని భార‌త ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 
 
కాగా పాకిస్తాన్‌ హై కమిషన్‌లో వీసా అధికారులుగా పనిచేస్తున్న తాహిర్‌ ఖాన్‌, అబిద్‌ హుస్సేన్‌ భారత ఆర్మీ రహస్యాలు సేకరించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రవేశించారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.