కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు  ప‌రామ‌ర్శించారు.  ఇవాళ రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లి చైనా సైనికుల దాడిలో అమ‌రుడైన క‌ల్న‌ల్ సంతోష్ బాబు చిత్రాప‌టానికి పుష్ప నివాళి అర్పించారు. 

సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం కల్నల్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. 

సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

కల్నల్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం అపాయింట్‌మెంట్ లెట‌ర్‌ను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ఇచ్చారు.

సూర్యాపేట‌లోని క‌ల్న‌ల్ సంతోష్ నివాసానికి వెళ్లిన వారిలో విద్యుత్‌శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, రోడ్లు, భ‌వ‌నాలు, గృహ‌నిర్మాణ‌, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌,  రాష్ట్ర సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉన్నారు.