మునిసిపల్ నిధులపై చేతులెత్తేసిన కేసీఆర్  

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేనని చేతులు ఎత్తివేసిన్నట్లు కనిపిస్తున్నది. దీంతో ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లే సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు దృష్టి సారిస్తున్నాయి.  వివిధ మార్గాల్లో నిధుల సేకరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. 

నిధుల సేకరణకు భూమి క్రమబద్దీకరణ పధకం (ఎల్ఆర్ఎస్)కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. భూముల క్రమబద్దీకరణకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 3,892 అక్రమ లే అవుట్లు, 2,81,171 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 

వీటన్నింటినీ క్రమబద్దీకరిస్తే భారీగా నిధులు సమకూరుతాయని మున్సిపల్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన 41 మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ గడువును సెప్టెంబర్ వరకు పెంచింది. 2018 మార్చి 30లోపు రిజిస్ట్రేషన్ చేయించిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం కల్పించారు.

జూన్30తో ఈ గడువు ముగియాల్సి ఉండగా, మున్సిపల్ శాఖ ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు రాకపోవడంతో ప్రభుత్వం గడువును మరోసారి పెంచింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములను భారీగా లే అవుట్లుగా, ప్లాట్లుగా మార్చారు. వీటి అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తయ్యాయి.

అనంతరం ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 41 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీలలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు సైతం నిధులు లేవు. దీంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలుతో నిధులు సేకరించాలని నిర్ణయించింది. అయితే ఎక్కువ మంది అందుకు ఆసక్తి చూపడం లేదు.

 కొత్త మున్సిపాలిటీలు ఇటీవలి వరకు గ్రామాలే. అక్కడ భూములను క్రమబద్దీకరించుకున్నా, లేకపోయినా  ధరల్లో పెద్దగా తేడా ఉండదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అందుకు దరఖాస్తు చేసుకోవడం లేదు. మరోవైపు క్రమబద్దీకరించి ప్లాట్‌‌లో నిర్మాణాలు చేయకుంటే ‘వేకెంట్‌‌ ల్యాండ్‌‌ పన్ను‌‌’ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగానూ ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపక పోవడంతో నిధుల సమీకరణ సమస్యగా మారింది.