
భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. గల్వాన్ లోయ ప్రాంతంలో చైనా దురాక్రమణను అడ్డుకునే క్రమంలో సోమవారం ఘర్షణ తలెత్తిన విషయాన్ని ప్రధాని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.
వాస్తవాధీన రేఖను దాటేందుకు యత్నించిన డ్రాగన్ సైన్యానికి భారత జవాన్లు ధీటుగా బదులిచ్చారని, అందుకే చైనా సైనికులు మన భూభాగంలో చొరబడలేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘వాస్తవాధీన రేఖ వెంబడి దురాక్రమణకు యత్నిస్తే భారత్ తీవ్రంగా స్పందిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేగాక గతంలో కంటే ఇప్పుడు సవాళ్లను మరింత గొప్పగా ఎదుర్కొంటున్నామని ఉద్ఘాటించారు. సరిహద్దుల్లో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే భారత బలగాలు నిర్ణయాత్మకంగా బదులు చెబుతున్నాయని స్పష్టం చేశారు” అని ఆ ప్రకటనలో తెలిపారు.
పైగా, వాస్తవాధీన రేఖ వద్ద చైనా అక్రమ నిర్మాణాలు, దురాక్రమణను అడ్డుకునే క్రమంలో జూన్ 15న గల్వాన్‌లో ఘర్షణ తలెత్తిందని స్పష్టం చేయబడింది. మన సాయుధ బలగాల ధైర్యసాహసాల పర్యవసానంగా వాస్తవాధీన రేఖ వెంబడి మన భూభాగంలోకి చైనీయులు ఎవరూ రాలేదన్నది ఆయన ఉద్దేశమని పేర్కొంది.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణలో పురోగతి