రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రష్యాలో కీలక పర్యటన 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నుంచి మూడురోజుల పాటు  రష్యా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై అప్పటి సోవియట్ యూనియన్ విజయం వజ్రోత్సవం సందర్భంగా జరిగే భారీ సైనిక కవాతుకు రక్షణ మంత్రి భారత్ తరఫున హాజరు అవుతున్నారు.

చైనా భారత్ మధ్య ఘర్షణ, తీవ్రస్థాయి ప్రతిష్టంభనకు దారితీయడం, 20 మంది భారతీయ సైనికుల బలిదానానికి తగు విధమైన స్పందన ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో  భారతదేశం నుంచి అతిథిగా రక్షణ మంత్రి పాల్గొంటారు.

ఈ పర్యటన ముందుగానే ఖరారు అయిందని, రష్యాతో భారత్‌కు ఉన్న చిరకాల సైనిక బంధం నేపథ్యంలోనే రక్షణ మంత్రి వెళ్లుతున్నారని, చైనాతో ప్రస్తుత పరిస్థితికి పర్యటనకు సంబంధం లేదని వివరణ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

రక్షణ మంత్రి రష్యా పర్యటన పట్ల భారత్‌లోని రష్యా దౌత్యవేత్త నికోలాయ్ కుదషెవ్ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి క్షేమంగా వెళ్లిరావాలని ఆశిస్తున్నట్లు, రష్యాకు భారత్  చిరకాల వ్యూహాత్మక భాగస్వామ్య పక్షంగా ఉందనే విషయం మరో మారు స్పష్టం అయిందని రష్యా రాయబారి చెప్పారు.

రష్యాలో జరిగే సైనిక కవాతులో 75 మంది సభ్యుల త్రివిధ బలగాల భారతీయ సైనిక బృందం కూడా పాల్గొంటుంది. ఇప్పటికే ఈ బృందం మాస్కోకు చేరుకుంది. రష్యాకు భారత రక్షణ మంత్రి వెళ్లడం ఇరుదేశాల మధ్యదీర్ఘకాలిక గౌరవప్రద భాగస్వామ్యానికి మరింత వన్నె అబ్బుతుందని మంత్రిత్వశాఖ స్పందించింది. రష్యాలో జరిగే కవాతులో చైనా, భారత్‌తో పాటు మొత్తం 11 దేశాల సైనిక బృందాలు పాల్గొంటాయి.