ఏపీలో కరోనా స్వైరవిహారం

ఏపీలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతున్నది. క్రమంగా పలు పట్టణాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ అని చెప్పకపోయినా కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం పరిస్థితుల తీవ్రతను వెల్లడి చేస్తున్నది.

కరోనా కేసులు 8,500కు చేరుకోవడం, మరణాల సంఖ్య 100కు మించిపోవడంతో కట్టడి పట్ల దృష్టి కేంద్రీకరింపవలసి వస్తున్నది. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో జనం యథేచ్ఛముగా తిరుగుతూ ఉండడం, సాంఘిక దూరం పాటించక పోవడం, మాస్క్ లను సహితం  ధరించక పోతూ ఉండడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.

మే 31న రాష్ట్రంలో మొత్తం కేసులు 3,571 కాగా, అప్పటికి 64మంది మరణించారు. ఆ తర్వాత 20రోజుల్లోనే కేసులు భారీగా పెరిగిపోయాయి. 90శాతం సడలింపులు అమల్లోకి వచ్చాక జూన్‌ 1న 3,781 కేసులు ఉండగా మరణాల సంఖ్య 66. శనివారం నాటికి  8,452కేసులు నమోదయ్యాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో 4,671 కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య 101కి చేరింది. ఈ నెలలో కరోనా బారినపడి 37 మంది మరణించారు.

పైగా కరోనా ఉధృతంగా నెలకొన్న హైదరాబాద్, చెన్నై లనుండి రాకపోకలు పెరుగుతూ ఉండడం సహితం వైరస్ విస్తృతంగా పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. పరిస్థితులను కట్టడి చేయని పక్షంలో ఏపీ కూడా త్వరలోనే మహారాష్ట్ర, తమిళనాడు సరసన చేరుతుందని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని చూసీచూడనట్లుగా వదిలేయడంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. ఇలాంటి వారంతా, స్పందన వెబ్‌సైట్‌లో కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఈ-పాస్‌ ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చినవారిలో ఎక్కువమందికి పాజిటివ్‌లు వస్తున్నాయి.

ఇప్పటికే కరోనా బారినపడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది హైదరాబాద్‌ నుంచి వచ్చినవారే ఉన్నారు. ఉద్యోగులు ఎవరూ హైదరాబాద్‌ వెళ్లొద్దని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు.

కానీ చాలామంది ఉద్యోగులు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ బాటపట్టారు. చెన్నై నుంచి కూడా వందల మంది నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వస్తున్నారు. వీరివల్ల కూడా రాష్ట్రంలో కరోనా ప్రభావం తీవ్రమవుతోంది. ఇలాంటివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

ఇప్పటికే విజయవాడలో 47వార్డులు కట్టడిలోకి వెళ్లిపోయాయి. జిల్లాల్లోనూ అనధికార లాక్‌డౌన్‌ అమలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

ఒంగోలులో ఆదివారం నుంచి 14రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చీరాలలో 17నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9వరకు నిత్యావసర, అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మిగతా సమయంలో అన్నీ బంద్‌ చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా శివారుల్లోనే నిలిపివేసే ఏర్పాటు చేశారు.

కాగా, అనంతపురం జిల్లాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. ఉదయం 6నుంచి 11 గంటల వరకు సడలింపులిచ్చారు. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలు చేయనున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు ప్రకటించారు.

చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌ వైరస్ ఇప్పుడు నగరాన్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా అప్పుఘర్, ఫిషర్‌మెన్‌ కాలనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దండుబజార్, అనకాపల్లి, మధురవాడ సాయిరాం కాలనీలను శాసిస్తోంది. కోయంబేడు వల్ల ఒక్క అప్పుఘర్‌ ప్రాంతంలోనే మొత్తం 57 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది