‘గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గర్‌‌ అభియాన్’ ప్రారంభిచిన ప్రధాని 

వలస కూలీల కోసం మోదీ  ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సొంతూళ్లలోనే పనులు చేసుకునే విధంగా ‘గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గర్‌‌ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 
 బీహార్‌‌లోని ఖగరియా జిల్లా తెలిహార్‌‌ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీన్ని రూ.50వేల కోట్లతో ప్రారంభించారు. “ వలస కూలీలకు ఇక నుంచి వారి సొంత ఊళ్లలోనే ఉద్యోగాలు ఉంటాయి. నగరాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించిన మీ ప్రతిభనుఇక నుంచి మీ సొంత గ్రామాలు, చుట్టు పక్కల గ్రామాలు అభివృద్ధి చేసేందుకు ఉపయోగించండి” అంటూ ప్రధాని పిలుపిచ్చారు. 
 
 బీహార్‌‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో  ఇళ్ల దగ్గరే పనులు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా బీహార్‌‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని కోసం 25 రకాల పనులను గుర్తించారు. 
 


లాక్‌డౌన్ స‌మ‌యంలో స్వంత గ్రామాల‌కు వ‌చ్చిన వ‌ల‌స కూలీలు త‌మ స్వ‌స్థ‌లాల్లోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్ తెలిపారు.  అయితే అలాంటి కూలీల‌కు ఈ ప‌థ‌కం ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. వ‌ల‌స కార్మికుల సంక్షేమం కోసం గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీని నితీశ్ మెచ్చుకున్నారు.

125 రోజుల ప‌నిదినాల్లో 25 ర‌కాల ప‌బ్లిక్ వ‌ర్క్స్‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్‌ తోమ‌ర్ తెలిపారు.  కోవిడ్‌19 వ‌ల్ల స్వంత ప్ర‌దేశాల‌కు తిరిగి వ‌చ్చిన వ‌ల‌స కూలీల‌కు ఈ ప‌థ‌కం కింద అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు.  20 ల‌క్ష‌ల కోట్ల ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీ ప్ర‌ధాని ప్ర‌క‌టించార‌ని,  ఆ ప్యాకేజీతో ఆర్థిక అభివృద్ధి మాత్ర‌మే కాకుండా, వ్య‌వ‌సాయం, గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు తోమ‌ర్ వివరించారు.

వివిధ రాష్ట్రాల్లో వ‌ల‌స కూలీలుగా ప‌నిచేసి.. తిరిగి స్వంత రాష్ట్రానికి చేరుకున్న కొంత మంది కూలీలు ప్ర‌ధాని మోదీతో వీడియోకాన్ఫ‌రెన్స్‌లో త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా సరిహద్దులో  అమరులైన  జవాన్లకు నివాళులర్పించారు. వారంతా బీహార్‌‌ రెజిమెంట్‌కు చెందిన వారే ప్రధాని  అని గుర్తు చేశారు.