
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ప్రభుత్వం కొత్త పథకాన్ని సిద్ధం చేసింది. వారి కోసం రూపొందించిన ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.50 వేల కోట్ల విలువచేసే ఈ పథకం వలస కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
ఈ పధకం ద్వారా దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కూలీలకు కనీసం 125 రోజులు పని కల్పించనున్నారు. ‘మేం 25 పనుల కల్పనకు రూ.50,000 కోట్లు కేటాస్తున్నాం. కూలీలందరికీ పని లభిస్తుంది. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. అలాగే, గ్రామీణాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ పథకాన్ని బీహార్‌లోని ఖగారియా జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభిస్తున్నారు. మొదటి దశలో 125 రోజులను నిర్ణయించి, 25 రకాల పథకాలను ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఈ పథకాల్లో జీవన్ మిషన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటివి ఉన్నాయి. వీటి ద్వారా వలస కూలీలకు పని కల్పిస్తారు. ఈ పథకాలద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తారు.
ఈ పథకాలను 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో నిర్వహించనున్నారు.ఈ 116 జిల్లాల్లో బీహార్‌లో 32 జిల్లాలు, ఉత్తర ప్రదేశ్‌లోని 31 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లో 24 జిల్లాలు, రాజస్థాన్‌లో 22 జిల్లాలు, ఒడిశాలో 4 జిల్లాలు, జార్ఖండ్‌లోని 3 జిల్లాలు ఉన్నాయి. ఇది వలస కార్మికులలో మూడింట రెండు వంతుల మందిని కవర్ చేస్తుంది.
ఈ గరిబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమన్వయం చేస్తుంది. దీనిలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, రహదారి రవాణా, రహదారి, గనులు, తాగునీరు, పారిశుధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం, సరిహద్దు రహదారి, టెలికం, వ్యవసాయం మొదలైనవి ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాలను నిర్వహిస్తాయి. 116 జిల్లాల్లోని కార్మికుల స్కిల్ మ్యాపింగ్ చేస్తుంది.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
నకిలీ వార్తలు సమాజానికి ప్రమాదకరం