గల్వాన్ లోయలో ఘర్షణకు దిగి 20 మంది భారత సైనికుల మరణానికి కారణమైన చైనా గాల్వన్ లోయ దురాక్రమణకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఒకటొక్కడి బయటపడు తున్నాయి. ఈశాన్య లడఖ్ గుండా ప్రవహిస్తున్న గల్వాన్ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చైనా బుల్డోజర్లను మోహరించింది.
సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల ప్రాంతానికి కిలోమీటరు దూరంలోనే ఈ వాహనాలు ఉండటం గమనార్హం. అమెరికాలోని ‘ప్లానెట్ ల్యాబ్స్’ సంస్థ తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎల్‌ఏసీకి తమ వైపున ఉన్న భూభాగంలో చైనా పలు బుల్డోజర్లను మోహరించింది. వాహనాలు ఉన్న ప్రాంతాల్లో గల్వాన్ నదీ ప్రవాహం క్రమంగా మారుతున్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నది. నీలం రంగులో ఉండే నదీ జలాలు బుల్డోజర్లు మోహరించిన ప్రాంతానికి చేరగానే బురద రంగులోకి మారినట్టు తెలుస్తున్నది.
బుల్డోజర్ల సాయంతో నీటి ప్రవాహాన్ని మట్టితో నిలివేయడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మీడియా సమావేశంలో ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ స్పందించేందుకు నిరాకరించారు.
గాల్వన్ నదిపై చైనా డ్యామ్ కడుతున్నట్లు జూన్ 16వ తేదీన తీసిన శాటిలైట్ ఫోటో ద్వారా స్పష్టం అవుతున్నది. నది ప్రవాహాన్ని కూడా ఆ దేశం అడ్డుకున్నది. తద్వారా భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా చైనా ఉల్లంఘించింది. దీనిపై జావోను సమాధానం కోరగా, అక్కడ జరుగుతున్న విషయాలు తనకేమీ తెలియదన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం గాల్వన్ లోయలో పరిస్థితి స్థిరంగా, అదుపులో ఉందని జావో తెలిపారు. ఇరు దేశాల నేతలు కుదుర్చుకున్న ఏకాభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఇనుప కడ్డీలు, ఇనుప మొలలు ఉన్నరాడ్లతో దాడి చేశారన్న ప్రశ్నను కూడా చైనా అధికారి దాట వేశారు.
పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట చైనా బుల్డోజర్లతో డ్యామ్ నిర్మాణంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో వాహనాలను చైనా మోహరించింది. శాటిలైట్ ఫోటోల్లో ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి.
More Stories
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్యం తోఫా’
జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం