ఎముకలు కొరికే చలిలో నదిలోనే  భీకరపోరు

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికులను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు వీరోచిత పోరు సలిపారు. గాల్వన్ నది వద్ద కేవలం ఒకే ఒక్కరు నిలిచే ఒడ్డుపై నిలపడి చైనా సైనికులతో తలపడ్డారని ఈ దశలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న సురేంద్ర సింగ్ అనే జవాను తెలిపారు.

ప్రస్తుతం లద్థాఖ్ సైనిక ఆసుపత్రిలో కోలుకుంటున్న సింగ్ “చైనా సైనికులు నమ్మించి దెబ్బతీశారు. ధోకాకు దిగారు. వారు వెనక్కి పోతున్నట్లుగా నటించి దాడికి దిగారు. నాలుగు అయిదు గంటలు నదిలోనే ఘర్షణ జరిగింది. చైనా సైనికులు వేయి మందికి పైగా ఉన్నారు. వారి దాడిని ఊహించకపోవడంతో మన వారు కేవలం 200 నుంచి 250 మంది ఎదురునిలిచారు” అని చెప్పారు.

“ఘర్షణ అంతా ఎముకలు గడ్డకట్టే గొంతు కోసుకుపొయ్యేంత తీవ్ర చలిని కల్గించే నీటిలోనే జరిగింది. నది ఒడ్డున కేవలం ఒక్కరు నిలబడే చోటనే నిలబడి చైనా వారితో పోరాడాం. దీనితోనే చాలా నష్టం జరిగింది. పలువురు ప్రాణాలు పోగొట్టుకోవల్సి వచ్చింది. భారత సైనికులను దొంగ దెబ్బతీశారు. లేకపోతే మన జవాన్లు ఎందులో తక్కువ తీసిపోరు” అంటూ తెలిపారు.

“దెబ్బకు దెబ్బతీసి తీరడంలో మనమే గొప్ప, చైనా వారికి సరైన జవాబు చెప్పి, తడాఖా చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. చైనా వారు వెన్నుచూపినట్లుగా నటించి వెన్నుపోటుకు దిగారు. ఇది కుట్ర, మోసపూరిత చర్య, నీతిరీతిలేని దాడి జరిగింది” అని అప్పటి పోరాట క్రమాన్ని సురేంద్ర సింగ్ తెలిపారు.

గాల్వన్ వద్ద జరిగిన పోరులో సింగ్ కూడా ఒక్కరిగా నిలిచారు. ఆయన తలకు గాయం అయింది. డజన్‌కు పైగా కుట్లు పడ్డాయి. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.చైనా హద్దులు దాటి రావడాన్ని ప్రతిఘటించేందుకు వెళ్లిన భారతీయ సైనికుల బృందంపై చైనా సైనికులు చేతుల్లోని రాడ్స్‌తో దౌర్జన్యానికి దిగారు. 

వారి చేతులో ముళ్ల ఇనుపతీగలు, వాటి మధ్యలో రాళ్లు కట్టేసి ఉన్నట్లు వెల్లడైంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ చైనా సైనిక మూకలను తట్టుకుని ధైర్యంగా ప్రతిఘటించే దశలోనే పలువురు భారతీయ సైనికులు మృతి చెందారు. చాలా మంది తీవ్రస్థాయిలో గాయపడి కుప్పకూలారు. కరడుగట్టిన కసితో సైనికులను పిఎల్‌ఎ బలగాలు మరీ వెంటపడి కొట్టినట్లు ఇప్పుడు చిత్రాలతో వెల్లడైంది.