ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో నగరంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
దీంతో ఆదివారం నుంచి నగరంలో పూర్థిస్థాయి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో అయిన సంగతి తెలిసింది. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా కేంద్రంలో మళ్లీ అవే నిబంధనలు పూర్తిగా అమలు చేయబోతున్నారు.
ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో రికార్డులు తిరగరాస్తోంది. బుధవారం అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయనుకుంటే తాజాగా గురువారం అందిన రిపోర్టులలో రికార్డు స్థాయిలో 38 కేసులు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజా కేసుల్లో ఒక్క చీరాల పట్టణంలోనే అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా జిల్లా కేంద్రంలో ఎనిమిది కేసులు, పామూరులో ఆరు కోవిడ్–19 కేసులు ఉన్నాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 268కి చేరింది.
ఒంగోలు నగరంలో ఈనెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాకు గురైన వారితోపాటు వారి కుటుంబీకుల్లో కూడా లక్షణాలు కనిపిస్తుండటం యంత్రాంగాన్ని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా కేసు వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఉన్న వారందరిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ నివేదికలు వచ్చేనాటికి సమయం పడుతుండటంతో యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది.
ఒంగోలులో కరోనా విజృంభిస్తుండటంతో తొలిసారిగా 13 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనుంది. నగరంలోని కంటైన్‌మెంట్ జోన్లలో భాగంగా 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా గుర్తించి, వాటి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి.
ఎంతమంది ప్రజలు నివశిస్తున్నారో లెక్క తేల్చారు. అదేవిధంగా మరో 200 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను బఫర్ జోన్లుగా గుర్తించి వాటి పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు నివశిస్తున్నారో కూడా నిర్ధారించారు. ఇలా ఉండగా, ఏపీలో కొత్తగా 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దానితో మొత్తం కేసులు ఇప్పటి వరకు మొత్తం 7961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 96 మంది మృతి చెందారు.
More Stories
రూ 1,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ కు భూసేకరణ
ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ `వారధి’
వైసీపీకి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని రాజీనామా