కరోనా,లాక్ డౌన్ లతో మూడు నెలలకు పైగా నిలిచిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు వచ్చే వారం నుండి తిరిగి ప్రారంభం కావడానికి రంగం సిద్దమైనది. గత నెలలోనే హైదరాబాద్ లో చిక్కుకు పోయిన వారిని తీసుకు రావడానికి ప్రత్యేక బస్సులు నడపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు.
ఈ నెల మొదట్లో లాక్ డౌన్ సడలింపులు తర్వాత బస్సులు నడపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దపడినా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు గురువారం విజయవాడలో సమావేశమై ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు నిర్ణయించారు.
కిలోమీటర్ల ప్రాతిపదికన మొత్తం నాలుగు దశల్లో సర్వీసులను అమల్లోకి తేనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో వచ్చే వారం నుంచి 256 బస్సులు నడపనున్నట్టు ఏపీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోయారు.
బస్సులు నడపడం కోసం ఏపీ అధికారులు స్పష్టమైన ప్రణాళికతో సమావేశానికి హాజరు కాగా తెలంగాణ అధికారులు మాత్రం తెల్లమొఖం వేసిన్నట్లు తెలుస్తున్నది. ఎప్పటి నుంచి, ఎన్ని బస్సులు నడపాలి, ఏయే రూట్లలో నడపాలి అనేది చెప్పలేకపోయారు.
ఇలా ఉండగా, అంతరాష్ట్ర బస్సు సర్వీసుల గురించి రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్ళు పూర్తయినా ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకోలేదు. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఒక ఒప్పందంపై రావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.
తెలంగాణ కంటే ఏపీ బస్సులు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయి. తెలంగాణలో ఏపీ బస్సులు 3 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటే, తెలంగాణ బస్సులు ఏపీలో 1.5 లక్షల కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ నెల23న హైదరాబాద్ బస్ భవన్ లో రెండు రాష్ట్రాల ఎండీలు సమావేశమై తుది నిర్ణయాలు అవకాశం ఉంది.
More Stories
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్
కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం