నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి 

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేయకుండా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను నిరోధిస్తూ వైసీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే రాష్ట్ర అధిపతిగా ఈ విషయంలో గవర్నర్  జోక్యం చేసుకోవాలి” అనిబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. 

స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ పనితీరులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్న తీరు సరికాదని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ‘‘అన్ని ప్రజాస్వామిక నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు తెగబడిన అధికార పార్టీ తీరుపై ఎప్పటికప్పుడు బీజేపీ మీ దృష్టికి తెచ్చింది” అంటూ ఆయన గవర్నర్ కు గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఇద్దరు జిల్లా ఎస్పీల బదిలీ, సస్పెన్షన్‌కు ఎన్నికల సంఘం సిఫారసు చేస్తే ప్రభుత్వం అమలు చేయలేదు. హైకోర్టు తీర్పులను సైతం ఉల్లంఘిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ప్రభుత్వం రమేశ్‌ కుమార్‌కు నరకం చూపిస్తోందని ఆ లేఖలో కన్నా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

హైకోర్టు తీర్పు మేరకు తన కార్యాలయానికి వచ్చిన రమేశ్‌ కుమార్‌ను అడ్డుకోవడానికి పోలీసు బలగాలను మోహరించడం దారుణమని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ రాజ్యాంగ అధిపతిగా సరిచేయాలని, రమేశ్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్‌కు బీజేపీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేసారు.