ఐసీఎంఆర్ సూచించిన సూచనలు పరిగణలోకి తీసుకొని ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే గాంధీతో పాటు 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.
మరోవంక, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కరోనాపై కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నందున వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని హైకోర్టు తెలిపింది. జీహెచ్‌ఎంసీ కరోనా కేసుల వివరాలు కాలనీ సంఘాలకు కూడా ఇవ్వాలని సూచించింది.
సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని తెలిపింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లోని సిబ్బందికి గాంధీ తరహా షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా లక్షణాలు లేని ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలన్న ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.
ఇక ఈ విచారణకు ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు శ్రీనివాసరావు హైకోర్టుకు తెలపగా.. గాంధీలో ప్లాస్మా, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. వీటిపై స్పందించిన హైకోర్టు ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
More Stories
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
ముడి పామాయిల్ దిగుమతిపై పన్ను పెంపు
గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు