క‌ల్న‌ల్ సంతోష్ భార్య‌కు గ్రూప్-1 ఉద్యోగం, రూ.5 కోట్లు   

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ఆయ‌న‌ కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ – 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు చెప్పారు.
 తానే స్వయంగా వీర జ‌వాన్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందిస్తాన‌ని తెలిపారు. గాల్వాన్ ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం వెల్లడించారు.
దేశ ర‌క్షణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న జ‌వాన్లు, వారి కుటుంబాల‌కు అండ‌గా దేశ‌మంతా నిల‌బ‌డుతుంద‌ని వారికి న‌మ్మ‌కం క‌లిగించాల‌ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. గాల్వన్ లోయ ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రులైన వీర సైనికుల కుటుంబాల‌కు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా సాయం చేయాల‌ని కోరారు.
చైనాతో స‌రిహ‌ద్దులో నెల‌కొన్ని ఉద్రిక్త‌త గురించి ప్ర‌ధాని మోడీ నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష భేటీలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున సీఎం కేసీఆర్ పాల్గొంటూ  ‘‘సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి” అని స్పష్టం చేశారు. 
 
“దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బుందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి’’ అని పేర్కొన్నారు.