కరోనాపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసిందా ? 

కరోనా కట్టడిలో కేసీఆర్  ప్రభుత్వం చేతులెత్తేసిందా? ఈ సందేహాన్ని స్వయంగా తెలంగాణ హై కోర్ట్ వ్యక్తం చేసింది. ‘‘ప్రభుత్వం పట్టు తప్పినట్లుగా అనిపిస్తోంది. చివరికి డాక్టర్లపై దాడులు జరిగే పరిస్థితులు వచ్చాయి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చినా పాలకులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల్నిఅమలు చేయక పోవడం కోర్టుధిక్కారం అవుతుందనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని హైకోర్టు ప్రశ్నించింది. 

గాంధీ హాస్పిటల్లోని పరిస్థితులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. హెల్త్ ‌డైరెక్టర్, కోఠి హాస్పిటల్ సూపరి టెండెంట్‌‌లు క్వారంటైన్‌‌లో ఉన్నారంటే.. 400 మంది మెడికల్‌‌ స్టాఫ్, 72 మంది డాక్టర్లకు కరోనా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది.

కరోనా కట్టడి కోసం ఏం చర్యలు తీసు కుంటున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాంధీ, నిమ్స్, కింగ్‌ కోఠి, ఫీవర్, చెస్ట్ ‌హాస్పిటళ్లలో డాక్టర్లు, మెడికల్‌ ‌స్టాఫ్‌‌కు పీపీఈ కిట్లు, రక్షణ పరికరాలు ఏవిధంగా ఇస్తున్నారో తెలియజేయాలని సూచించింది. గాంధీ హాస్పిటల్లో పరిస్థితిపై  స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండ్ ను, వైద్య శాఖ డైరెక్ట ర్‌‌ను కూడా ఆదేశించింది.  

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రోజుకు 200 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, వైరస్ కట్టడికి యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని సూచించింది. హెల్త్ ‌డైరెక్టర్‌ ‌శ్రీనివాసరావు మాత్రం ఏడు లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారే గానీ వాటిని డాక్టర్లకు, మెడికల్‌‌ స్టాఫ్‌‌కు ఇచ్చారో లేదో చెప్పడం లేదని హైకోర్టు మండిపడింది.